చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు సాగించిన అరాచకాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని మాజీ మంత్రి విడదల రజిని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలింగ్ రోజు బూత్ ఆక్రమణలు, దొంగ ఓట్లతో రిగ్గింగ్‌కు పాల్పడిన టీడీపీ, కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై భౌతిక దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్తిపాటి పుల్లారావు అనుచరులు సాగించిన ఈ దౌర్జన్యాలు, హింసాత్మక చర్యలు ఎన్నికల ప్రక్రియ పారదర్శకతనే ప్రశ్నార్థకం చేశాయన్నారు. ప్రజల తీర్పును గౌరవించకుండా, అధికార మదంతో ప్రత్యర్థుల గొంతు నొక్కి సాధించినదాన్ని గెలుపు అనలేరని స్పష్టం చేసిన రజిని, కౌంటింగ్ కేంద్రాల వద్ద జరిగిన దాడులపై ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.